గుత్తి, అనంతపురం జిల్లా: సోలార్ కంపెనీల వల్ల నష్టపోయిన రైతుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
మంగళవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెడ్. వీరారెడ్డి కాలనీలో నిర్వహించిన గుత్తి మండల కమిటీ సమావేశానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఓనల్లప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆగస్టు 14న ఉదయం 10 గంటలకు గుత్తి పట్టణంలోని పెద్ద షాదీఖానా ఫంక్షన్ హాల్‌లో సోలార్ బాధిత రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించాలని రాష్ట్ర రైతు సంఘం నిర్ణయించినట్లు తెలిపారు.
సోలార్ కంపెనీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలపై రైతులు పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాలని, మోసపూరిత షరతులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుల భూములను రక్షించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని వివరించారు.
రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ కరవుకు నిలయంగా ఉందని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించి పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండే అవకాశం ఉందన్నారు.
సోలార్ కంపెనీలతో రైతులకు తలెత్తే వివాదాలను ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి దూర ప్రాంతాల సివిల్ కోర్టుల్లో కాకుండా, రైతుల నివాస ప్రాంతానికి సమీపంలోని కోర్టుల్లోనే పరిష్కరించుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే, సోలార్ కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి ద్వారా పొందే లాభాల్లో ప్రతి ఏడాది 10 శాతం డివిడెండ్‌ను భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాలని, మరో 10 శాతం నిధులను గ్రామాభివృద్ధికి కేటాయించేలా ప్రభుత్వం నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన గ్రామాల్లోని ప్రజలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కూడా కోరారు.
ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత సోలార్ కంపెనీలు దాదాపు 30 సంవత్సరాల పాటు లాభాలు పొందుతున్నాయని, పెట్టుబడి ఐదేళ్లలోనే తిరిగి వచ్చేస్తుందని పేర్కొంటూ, రైతులకు నష్టం కలిగించే ఒప్పంద నిబంధనలను ప్రభుత్వం జోక్యం చేసుకుని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది.
ఈ సమావేశంలో గుత్తి మండల కార్యదర్శి నిర్మల, రైతు సంఘం నాయకులు రామకృష్ణ, మద్దిలేటి, మహిళా సంఘం నాయకులు రేణుక, రేవతి, కెవీపీఎస్ నాయకుడు మల్లికార్జున, సీఐటీయూ నాయకుడు రమేష్, సహకార సంఘం నాయకులు మల్లేష్, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.








