జగిత్యాల : జగిత్యాల జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లలో నమోదైన వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీట్ల నిర్వహణపై సమీక్ష సమావేశంలో ఎస్పీ వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో అమలవుతున్న పర్యవేక్షణ చర్యలను సమీక్షించారు. తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై చేపడుతున్న చర్యలు, వారి కదలికలపై నిఘా, కేసుల పురోగతిపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలు, ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న వ్యక్తులను ముందుగానే గుర్తించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే బైండోవర్ చర్యలు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పాత నేరస్థులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ, హిస్టరీ షీట్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. అలాగే రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులు, అల్లర్లలో ప్రమేయం ఉన్న వారిని ప్రతి నెల పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి వివరాలు నమోదు చేసి, వారి కార్యకలాపాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతామని, జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ప్రజల భద్రతే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.








