contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరీంనగర్‌లో ముమ్మర నాకాబందీ .. 256 ట్రాఫిక్ కేసులు నమోదు

కరీంనగర్ : శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని టౌన్, రూరల్ డివిజన్లలో బుధవారం విస్తృత స్థాయిలో నాకాబందీ (వాహనాల తనిఖీ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుని మొత్తం 256 ఈ-చలాన్ కేసులు నమోదు చేసి రూ.78,930 జరిమానా విధించినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు.

పోలీసు అధికారులు, సిబ్బంది ప్రధాన కూడళ్లు, బస్ స్టాండ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైన చోట వాహనాలను సీజ్ చేశారు.

నాకాబందీ కార్యక్రమంలో 251 ద్విచక్ర వాహనాలు, 5 నాలుగు చక్రాల వాహనాలపై చలాన్లు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 4 ఈ-పెట్టీ కేసులు కూడా నమోదు చేశారు.

తనిఖీల్లో చొప్పదండి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 80 కేసులు నమోదు చేసి రూ.16,365 జరిమానా విధించారు. గీతా భవన్ జంక్షన్‌లో 34 కేసులు నమోదు చేసి రూ.8,000 జరిమానా విధించడంతో పాటు నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. రామ్‌నగర్ సిగ్నల్ వద్ద 31 కేసులు నమోదు చేసి రూ.6,800 జరిమానా విధించగా, పత్రాలు లేని రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

అదేవిధంగా మంచిర్యాల చౌరస్తాలో 27 కేసులు నమోదు చేసి రూ.9,000 జరిమానా విధించడంతో పాటు మద్యం సేవించి ఆటో నడిపిన ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎన్‌టీఆర్ జంక్షన్, కేబుల్ బ్రిడ్జ్ వద్ద నిబంధనలు పాటించని వాహనదారులపై చలాన్లు నమోదు చేసి నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బస్ స్టాండ్ సర్కిల్‌లో సరైన పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.

ఎన్జీఓస్ కాలనీ, నాకా చౌరస్తా, ఎస్ఆర్‌ఆర్ కళాశాల జంక్షన్, బీఆర్‌ఆర్ ఎల్ఎండి, గంగధర, మల్లాపూర్, మానకొండూర్, గన్నేరువరం తదితర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లాలని, హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు లేకుండా లేదా సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ప్రత్యేక నాకాబందీ తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :