కాకినాడ : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పట్టణాల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA), రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (RUDA)లు ప్రజల నుంచి కోట్లాది రూపాయల అభివృద్ధి రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ సొంత కార్యాలయ భవనాలను నిర్మించకపోవడం దురదృష్టకరమని పౌర సంక్షేమ సంఘం విమర్శించింది.
సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. 2016 నవంబర్ 22న ఏర్పడిన గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని పరిపాలనా సౌలభ్యం కోసం 2022 నవంబర్ 17న కాకినాడ, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలుగా విభజించినప్పటికీ, ఇప్పటివరకు ఈ సంస్థలకు శాశ్వత కార్యాలయ భవనాలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఅవుట్ అనుమతులు, బిల్డింగ్ ప్లాన్లు, ఎల్‌ఆర్‌ఎస్ వంటి సేవల ద్వారా ప్రజల నుంచి భారీ మొత్తంలో అభివృద్ధి రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇప్పటికీ భవానీనగర్‌లోని ప్రైవేట్ అద్దె భవనంలో కొనసాగుతూ ప్రజాధనాన్ని అద్దెల రూపంలో ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నగరపాలక సంస్థ పాత కౌన్సిల్ హాల్‌లోనే కార్యకలాపాలు నిర్వహించడం ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికా లోపానికి నిదర్శనమని విమర్శించారు.
సొంత భవనాల నిర్మాణానికి స్థల కేటాయింపు, నిధుల అంచనాలు, ప్రభుత్వ ఆమోదాలపై స్పష్టత లేకుండా తాత్కాలిక కార్యాలయాల్లో కొనసాగించడం సరైన విధానం కాదన్నారు. కేవలం వసూళ్ల లక్ష్యాలతోనే ఈ సంస్థలను నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
2022లో సంస్థలు ఏర్పడినప్పటి నుంచి పూర్తిస్థాయి పాలక మండలి, స్వతంత్ర డైరెక్టర్ల బోర్డును నియమించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రమణరాజు అన్నారు. టెక్నికల్ నిపుణులు, ఆర్థిక నిపుణులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కూడిన డైరెక్టర్ల బోర్డు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయి సమస్యలు విధాన నిర్ణయాలుగా మారే అవకాశం లేకుండా పోయిందన్నారు.
జాయింట్ కలెక్టర్‌ను వైస్ చైర్మన్‌గా కొనసాగిస్తూ ప్రత్యేక అధికారి పాలన తరహాలో వ్యవస్థను నడపడం స్థానిక పాలనకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు డైరెక్టర్ల బోర్డులో స్థానం కల్పించకపోవడంతో భూవినియోగ మార్పులు, జోనింగ్ నిర్ణయాలపై స్థానిక ప్రజలకు అవగాహన లేకుండా పోతోందని అన్నారు.
క్వార్టర్లీ ఆడిట్ సమీక్షలు నిర్వహించే డైరెక్టర్ల బోర్డు లేకపోవడం వల్ల సంస్థల నిర్ణయాల్లో పారదర్శకత తగ్గిపోయి, ఈ సంస్థలు కేవలం “వసూళ్ల విభాగాలుగా” మారిపోయాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
సంస్థలకు ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ, ఆ నిధులను స్థానిక రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించకుండా, దాదాపు 80 నుంచి 90 శాతం వరకు రాష్ట్రస్థాయి పూల్ ఖాతాలకు మళ్లించడం అత్యంత అన్యాయమని అన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం వల్ల స్థానిక అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సెక్షన్ 4(1)(బి) ప్రకారం గత ఆర్థిక సంవత్సరాల వారీగా సేకరించిన ఆదాయం, వ్యయం, మిగులు, ప్రభుత్వానికి మళ్లించిన నిధుల వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ అధికారులు వెంటనే స్పందించి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల్లో ఆర్థిక పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని, పూర్తిస్థాయి డైరెక్టర్ల బోర్డును నియమించాలని, అలాగే సొంత కార్యాలయ భవనాల నిర్మాణానికి స్థల కేటాయింపు, బడ్జెట్ అంచనాలను అధికారిక జీవో ద్వారా ప్రకటించాలని రమణరాజు డిమాండ్ చేశారు. ఈ అంశాల్లో ప్రభుత్వం స్పందించని పక్షంలో పారదర్శకత కోసం లోకాయుక్తను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.








