contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడ బడ్జెట్‌ను ఎందుకు దాస్తున్నారు? దూసర్లపూడి రమణరాజు

కాకినాడ: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.767.43 కోట్ల వార్షిక బడ్జెట్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచినప్పుడు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) మాత్రం బడ్జెట్ వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ప్రశ్నించారు.

కౌన్సిల్ లేకపోయినా ప్రత్యేక అధికారి, కలెక్టర్ పాలనలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ బడ్జెట్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచిందని ఆయన గుర్తుచేశారు. కాకినాడలోనూ ఇదే తరహా ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో 2026-27 పూర్తి స్థాయి బడ్జెట్ వివరాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం, కౌన్సిల్ సమావేశాలు లేకపోవడం వంటి కారణాలను చూపుతూ ప్రజల సొమ్ము ఎలా ఖర్చవుతోందో సామాన్యులకు తెలియకుండా బడ్జెట్‌ను అంతర్గత పరిపాలనా ఫైళ్లకే పరిమితం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రమణరాజు విమర్శించారు.

రూ.32 కోట్లకుపైగా లోటు ఎందుకు?

గత అధికారిక లెక్కలను ప్రస్తావించిన ఆయన.. కార్పొరేషన్ సొంత ఆదాయం సుమారు రూ.76.30 కోట్లు ఉండగా, వ్యయం రూ.108.62 కోట్లుగా నమోదైందని తెలిపారు. అంటే సుమారు రూ.32.32 కోట్ల లోటు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే గత పదేళ్లలో కాకినాడ కార్పొరేషన్‌కు సంబంధించిన సుమారు రూ.79.92 కోట్ల విలువైన ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయని రమణరాజు ఆరోపించారు. సంబంధిత ఒరిజినల్ బిల్లులు, వినియోగ ధ్రువీకరణ పత్రాలను ఆడిట్ విభాగానికి సమర్పించడంలో వైఫల్యం చోటుచేసుకుందని విమర్శించారు.

అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నగర ప్రాథమిక సమస్యలకు ప్రాధాన్యత ఏది?

కాకినాడ నగరంలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత డివిజన్లలోని రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయని రమణరాజు అన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అనేక వీధి కల్వర్టులు శిథిలావస్థకు చేరి స్లాబ్‌లు దెబ్బతింటున్నాయని తెలిపారు.

నగర ప్రజలకు అవసరమైన సమగ్ర తాగునీటి సరఫరా, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి ముంపు నివారణ, ఉప్పుటేరు ప్రక్షాళన, వీధి కుక్కల నియంత్రణ వంటి మౌలిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

కార్పొరేషన్ పరిధికి సంబంధించిన ప్రాథమిక మౌలిక వసతుల సమస్యలను పక్కనపెట్టి ఇతర ప్రాంతాల రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. చెట్లకు హాని కలిగించే వైట్ సిమెంట్ అలంకరణలు, స్వాగత తోరణాల కంటే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పన్నులు వసూలు చేస్తున్నప్పుడు బడ్జెట్ ఎందుకు రహస్యం?

ప్రతి ఏడాది ఆస్తి పన్నుల పెంపుతో పాటు లైబ్రరీ పన్ను, వివిధ యూజర్ చార్జీల రూపంలో ప్రజల నుంచి నగర పాలక సంస్థ ఆదాయం సమకూర్చుకుంటోందని రమణరాజు తెలిపారు. ప్రజల నుంచి పన్నులు, రుసుములు వసూలు చేస్తున్నప్పుడు ఆ నిధుల ఆదాయం, వ్యయం వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

రాజమహేంద్రవరం తరహాలోనే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా సుమారు రూ.80 కోట్లుగా పేర్కొంటున్న ఆడిట్ అభ్యంతరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కాకినాడ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆదాయం, వ్యయం, లోటు, బకాయిలు, అప్పులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు, పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి ఆర్థిక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.

“ప్రజల డబ్బుతో నడిచే సంస్థ ఆర్థిక వ్యవహారాలు ప్రజలకు తెలియాలి. బడ్జెట్‌ను దాచడం కంటే పారదర్శకంగా వెల్లడించడం ద్వారానే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :