గోదావరిఖని : తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి.. రాత్రివేళ తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదును దొంగిలిస్తున్న నిందితుడిని మంథని సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రామగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు వివరాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ మంథని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పోలీసులను చూసి పరారయ్యే యత్నం
పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 8న రామగిరి ఎస్సై టి. శ్రీనివాస్ తన సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుండగా తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి కనిపించాడు. పోలీసులను గమనించిన అతడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
అనుమానం రావడంతో అతడిని తనిఖీ చేయగా ఒక బటన్ కత్తి లభించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, చోరీలకు వచ్చినట్లు అంగీకరించడంతో పాటు గతంలో తాను, తన సహచరులతో కలిసి చేసిన పలు దొంగతనాల వివరాలను వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో..
అరెస్ట్ అయిన వ్యక్తిని జగిత్యాల జిల్లా తారక రామనగర్‌కు చెందిన వనం రాము (36) గా పోలీసులు గుర్తించారు. గతంలో గ్రామాల్లో తిరుగుతూ తల వెంట్రుకలు సేకరించి విక్రయిస్తూ జీవనం సాగించేవాడని తెలిపారు. ఆ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాల బాట పట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
రాము తన భార్య కవిత, జగిత్యాల రామనగర్‌కు చెందిన దాసరి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన వనం పాపయ్య, అశ్వారావుపేటకు చెందిన తన తమ్ముడు వనం నగేష్‌లతో కలిసి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పగటిపూట రెక్కీ.. రాత్రివేళ చోరీ
వివిధ వాహనాల్లో పగటిపూట గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారని, రాత్రి సమయంలో ఆయా ఇళ్లకు వెళ్లి తాళాలు పగులగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించేవారని పోలీసులు తెలిపారు.
గతంలో రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
నెలల తరబడి సాగిన చోరీల పరంపర
పోలీసుల ప్రకారం.. 2025 అక్టోబర్‌లో కల్వచర్ల, ఓడేడు ప్రాంతాల్లో వరుసగా ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు నిందితుడు వెల్లడించాడు. కల్వచర్లలో ఒక ఇంటి నుంచి రూ.40 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు, ఓడేడు ప్రాంతంలోని మరో ఇంటి నుంచి రూ.1 లక్ష నగదు, బంగారు ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు.
2025 నవంబర్‌లో ముత్తారం, కల్వచర్ల ప్రాంతాల్లో చోరీలకు ప్రయత్నించగా.. ఒక ఇంట్లో ఎలాంటి సొత్తు లభించలేదని, మరో ఇంట్లో రూ.15 వేల నగదు దొంగిలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధర్మారం మండలం దొంగతుర్తి, పత్తిపాక గ్రామాల్లో, మార్చిలో రత్నాపురంలో, జూన్‌లో జూలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.
రత్నాపురంలో సుమారు 6 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.9,500 నగదును దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం
ఏప్రిల్ 15న పెద్దపల్లి ప్రాంతంలో దొంగతనం చేసేందుకు తిరుగుతున్న సమయంలో పోలీసులు గుర్తించడంతో రాము, అతని భార్య కవిత పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో సహచరులైన రవి, పాపయ్య, నగేష్‌లు కల్వచర్లలో పోలీసులకు చిక్కే పరిస్థితి ఏర్పడగా, రాము అక్కడి నుంచి తప్పించుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
దొంగిలించిన బంగారంతో తాకట్టు.. విక్రయం
చోరీ చేసిన బంగారు ఆభరణాల్లో కొన్నింటిని జగిత్యాలలోని ముత్తూట్ పిన్‌కార్ప్‌లో తన పేరుతో తాకట్టు పెట్టినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. వాటి ద్వారా వచ్చిన నగదును ఎన్నికల సమయంలో ఖర్చు చేసినట్లు విచారణలో చెప్పినట్లు తెలిపారు.
మరికొన్ని ఆభరణాలను జగిత్యాల టవర్ సర్కిల్లోని ఓ నగల దుకాణంలో విక్రయించినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆ దుకాణ యజమాని గంగారం కొన్ని నెలల క్రితం మృతి చెందినట్లు నిందితుడు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఆభరణాల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని సహచరులకు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని కుటుంబ ఖర్చులు, ఇతర అవసరాలకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
సెప్టిక్ ట్యాంకర్ కొనుగోలుకు చోరీ సొమ్ము
ఓడేడు గ్రామంలో దొంగిలించిన రూ.1 లక్షతో పాటు గతంలో చోరీ చేసిన నగదును కలిపి మొత్తం రూ.2 లక్షలను ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంకు చెందిన వ్యక్తికి సెప్టిక్ ట్యాంకర్ కొనుగోలు కోసం చెల్లించినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఇతర నిందితులపై కొనసాగుతున్న దర్యాప్తు
నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని ఏసీపీ ఎం. రమేష్ తెలిపారు. చోరీలకు సంబంధించిన ఆస్తి రికవరీతో పాటు ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన మంథని సీఐ బి. స్వామి, రామగిరి ఎస్సై టి. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ భార్గవ్, కానిస్టేబుళ్లు డి. రమేష్, వి. అభిషేక్, బి. రాజ్‌కుమార్‌లను ఏసీపీ అభినందించారు.
తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుసగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.








