రామగుండం : పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌశిక్ హరి, వ్యాల్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయకుండా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు రామగుండం ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన పేద కుటుంబాలకు పెండింగ్ నిధులు విడుదల చేయడంతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.








