contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైద్యం అందక గిరిజన తల్లి మృతి

అనకాపల్లి జిల్లా, రోలుగుంట: రోడ్డు సౌకర్యం, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పరిధిలోని పాత లోసింగి పీవీటీజీ కొందు ఆదివాసీ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 24 ఏళ్ల పాంగి రాజేశ్వరి బుధవారం ఉదయం ప్రసవ సమయంలో ఇద్దరు శిశువులకు జన్మనిచ్చిన అనంతరం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనపై అధికారులు స్పందించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖరరావు, స్థానిక ఎంఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. రాజేశ్వరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

గ్రామంలో ఆశా కార్యకర్త లేకపోవడం, అంగన్వాడీ కేంద్రం లేకపోవడం, రహదారి సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో వైద్యం అందించడం కష్టంగా మారుతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 13 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. సుమారు 320 మంది జనాభా ఉన్న గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో కూడా పెద్దగరువు, పిత్రిగడ్డ తదితర గ్రామాల్లో గర్భిణులు, శిశువులకు సంబంధించిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు పేర్కొన్నారు. రహదారి సమస్య పరిష్కారం కోసం 2020లో మూడు గ్రామాల ప్రజలు స్వయంగా చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించగా.. వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయిందని తెలిపారు.

తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరై రోడ్డు పనులు ప్రారంభమైనప్పటికీ.. ఫార్మేషన్ పనులు, కల్వర్టుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాలకు ఆ నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయని చెబుతున్నారు.

రోడ్డు, అంగన్వాడీ, ఆశా కార్యకర్త వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గతంలో చోడవరంలో ఆదివాసీలు డోలి యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు గుర్తుచేశారు.

తాజా ఘటన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజేశ్వరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, గ్రామంలో శాశ్వత రహదారి, అంగన్వాడీ కేంద్రం, ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు, పీవీటీజీ సంఘం నాయకులు పాంగి భాస్కరరావు, కొండతాంబిలి వెంకట్రావు, కొండపాముల సత్తిబాబు తదితరులు డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :