కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో దళిత జర్నలిస్టుపై దౌర్జన్యం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నించిన విశాలాంధ్ర కుమురంభీం జిల్లా అక్రిడిటేషన్ స్టాఫ్ రిపోర్టర్ ఈర్ల సతీష్ పట్ల తహసీల్దార్ మధుకర్, కార్యాలయ సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
ఈర్ల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం సుమారు 3.30 నుంచి 4.10 గంటల మధ్య తహసీల్దార్ ఛాంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యంపై ప్రశ్నించగా తనతో కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. తాను అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టునని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
తహసీల్దార్ ఆదేశాల మేరకే కార్యాలయ సిబ్బంది తనను భయభ్రాంతులకు గురిచేశారని సతీష్ ఆరోపించారు. ఆర్‌డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌరవ్ మండల్, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది మల్లు భాయ్ తదితరులు తన సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను తొలగించారని ఆరోపించారు.
ఘటన సమయంలో సూర్య రిపోర్టర్ వెంకన్న, నినాదం రిపోర్టర్ రతన్ అక్కడే ఉన్నారని సతీష్ తెలిపారు. జరిగిన విషయంపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే తహసీల్దార్ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.
జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించడం, సెల్‌ఫోన్ లాక్కోవడం, అందులోని డేటాను తొలగించారన్న ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నాయి. దళిత జర్నలిస్టుపై కులపరమైన అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ మధుకర్‌తో పాటు సంబంధిత సిబ్బంది పాత్రపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరుతున్నారు. కులపరమైన అవమానాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయితే ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్) చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.









