contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది: దద్దాల నారాయణ యాదవ్

కనిగిరి: బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా సమాజానికి వెన్నుముకగా గుర్తించి రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం కల్పించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు.

కనిగిరిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని వివరించారు. బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతున్నామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కూటమి ప్రభుత్వం మరిచిపోయిందా అని ప్రశ్నించారు. ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రచారాలు చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో బీసీలకు చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పించామని దద్దాల నారాయణ యాదవ్ పేర్కొన్నారు. రాజ్యసభలో బీసీలకు ప్రాతినిధ్యం, అసెంబ్లీ స్థానాల కేటాయింపు, బీసీ నేతలకు కీలక పదవులు కల్పించడం వంటి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

139 బీసీ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు రాజకీయంగా గుర్తింపు కల్పించామని ఆయన అన్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, దేవాలయ బోర్డులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలుపై కూటమి ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, తమ హక్కులను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :