హైదరాబాద్ : గణపతి నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఉత్సవాలకు ఆహ్వానం అందించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.








