కరీంనగర్ జిల్లా: రాబోయే వినాయక చవితి, గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కరీంనగర్‌లోని అస్త్ర కన్వెన్షన్ హాల్లో గురువారం గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సీపీ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిప్రమాదాల నివారణ, మహిళల భద్రత, నిమజ్జన ఏర్పాట్లపై నిర్వాహకులకు వివరించారు. అనంతరం పోలీసు అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి మార్గదర్శకాల పోస్టర్‌ను విడుదల చేశారు.
వివాదాస్పద ప్రాంతాల్లో మండపాలకు అనుమతి లేదు
కొత్తగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు ముందుగానే పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సీపీ సూచించారు. సంబంధిత ఎస్హెచ్ఓ క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అనుమతులపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వివాదాస్పద ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసి సమస్యలకు తావివ్వొద్దన్నారు. ఒకే కాలనీలో పక్కపక్కనే పోటీగా మండపాలు ఏర్పాటు చేసి ఘర్షణలకు కారణం కావద్దని సూచించారు.
అగ్నిప్రమాదాలపై అప్రమత్తత
ప్రతి గణేష్ మండపం వద్ద డీసీపీ (డ్రై కెమికల్ పౌడర్) రకం ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడితే నీటిని ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో మండపాలను ఖాళీగా ఉంచరాదని, పెద్ద మండపాల వద్ద కనీసం ముగ్గురు వాలంటీర్లు కాపలాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
ప్రతి మండపం వద్ద నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ తెలిపారు. దొంగతనాలు, అనుమానాస్పద కదలికలు, ఆకతాయి చేష్టలను అరికట్టడంతో పాటు తప్పుడు ప్రచారాలు, పుకార్లను నియంత్రించడంలో సీసీ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని పేర్కొన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు
గణేష్ మండపాల వల్ల రహదారులపై రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ముఖ్యంగా అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు వంటి అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతో పాటు క్యూ లైన్ల వద్ద బారికేడ్లు లేదా రోప్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
డీజేలకు అనుమతి లేదు
గణేష్ ఉత్సవాల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా రెండు సాధారణ సౌండ్ బాక్సులకు మాత్రమే అనుమతి ఉంటుందని, వాటిలో భక్తి గీతాలు మాత్రమే ప్రసారం చేయాలని సూచించారు. రెచ్చగొట్టే, వివాదాస్పద పాటలు లేదా వ్యాఖ్యలు ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రులు తదితర సైలెంట్ జోన్ల వద్ద శబ్ద కాలుష్యానికి తావివ్వకూడదన్నారు.
మహిళల భద్రతకు షీ టీమ్స్ నిఘా
మండపాల వద్ద రద్దీ సమయాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్, మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు సీపీ తెలిపారు. మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగానే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు
సెప్టెంబర్ 16 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండపాల వద్ద వాటర్‌ప్రూఫ్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు, కనెక్షన్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షార్ట్సర్క్యూట్లు, విద్యుత్ ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని అన్నారు.
నిమజ్జనంలో జాగ్రత్తలు తప్పనిసరి
గణేష్ నిమజ్జనానికి సంబంధించిన మార్గాలు, సమయాల్లో చివరి నిమిషంలో మార్పులు చేయకూడదని సీపీ సూచించారు. నిమజ్జన వాహనాల డ్రైవర్లు మద్యం సేవించకుండా నిర్వాహకులు పర్యవేక్షించాలని తెలిపారు. నిమజ్జన ఘాట్లు, చెరువుల వద్ద చిన్నారులు, వృద్ధుల భద్రతపై కుటుంబ సభ్యులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దు
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, మత సామరస్యానికి భంగం కలిగించే సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సీపీ గౌష్ ఆలం సూచించారు. ఏదైనా సమస్య లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా వెంటనే డయల్ 100 లేదా 112కు, స్థానిక ఎస్హెచ్ఓ లేదా సెక్టార్ ఎస్ఐకి సమాచారం అందించాలని కోరారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించడంలో పోలీస్ కమిషనరేట్‌కు ప్రజలు, ఉత్సవ కమిటీలు పూర్తిస్థాయిలో సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, సతీష్, యాదగిరిస్వామి, ఉత్సవ సమితి అధ్యక్షుడు కె. మహేశ్వర్, పండితులు శ్రీనివాస శర్మ, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖ్ రాధాకృష్ణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి శ్యామ్‌తో పాటు కరీంనగర్‌లోని వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.








