contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీని అమలు చేయాలి

కనిగిరి : ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లు నిండిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్ రావు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఇచ్చిన హామీలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం కనిగిరి సబ్ డివిజన్‌లో పెండింగ్ కేసుల విషయమై సీఐ యు. శ్రీనివాస్ రామన్, ఎస్సై సందీప్‌ను కలిసి ఆయన చర్చించారు. అనంతరం కనిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల మేనిఫెస్టోలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీలకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారని నీలం నాగేందర్ రావు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీపై ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల హామీల్లో లేని పలు పథకాలను సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తోందని, కానీ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన హామీలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

గత ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసిన 28 ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిపై కూడా దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు.

ఇతర సామాజిక వర్గాలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని నీలం నాగేందర్ రావు ఆరోపించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు మరింత అవసరమని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఎస్సీ, ఎస్టీ సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ మంజూరు అంశంపై స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై స్పందించి, హామీ అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, గతంలో నిలిచిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని నీలం నాగేందర్ రావు కోరారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను, మాదిగ పరిరక్షణ సమితి కార్యదర్శి పట్రా బంగారం, జి. బర్నబాస్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :