తూప్రాన్ : మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్న అమూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కార్యక్రమ ప్రాంగణాన్ని పరిశీలించారు.
ప్రముఖుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, బందోబస్తు విధులు తదితర అంశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాలు, విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరయ్యే నేపథ్యంలో ప్రతి అంశాన్ని ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్పీ వెంట అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, సీఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.








