మాచర్ల: పట్టణానికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి, యువ షటిల్ క్రీడాకారుడు గుడిపాల లీలాకృష్ణకు మండవ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఇటీవల అమరావతిలో నిర్వహించిన అండర్-23 రాష్ట్రస్థాయి షటిల్ పోటీలకు లీలాకృష్ణ ఎంపిక కావడంతో అతడి క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ట్రస్ట్ తరఫున రూ.20 వేల విలువైన షటిల్ కిట్‌ను అందజేశారు.
సోమవారం మండవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు మండవ రవి ఆధ్వర్యంలో ఈ సహాయాన్ని లీలాకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా మండవ రవి మాట్లాడుతూ.. లీలాకృష్ణ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మాచర్లకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆర్థిక ఇబ్బందులు ప్రతిభ కలిగిన క్రీడాకారుల ఎదుగుదలకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో మండవ చారిటబుల్ ట్రస్ట్ క్రీడాకారులకు అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. షటిల్ క్రీడలో మరింత కష్టపడి సాధన చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని లీలాకృష్ణను అభినందించారు.
ఈ సందర్భంగా లీలాకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.








