గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గురువారం గన్నేరువరం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గన్నేరువరం నుండి బెజ్జంకి, సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు, అలాగే కరీంనగర్ నుండి హన్మాజీపల్లి మీదుగా గన్నేరువరం మండల కేంద్రానికి వచ్చే రెండు బస్సు సర్వీసులను రెండు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో కలిసి ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే గత నాలుగైదు రోజుల నుంచి ఈ బస్సులు రావడం లేదని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు మండల ప్రజలకు “మూడునాళ్ల ముచ్చట”గా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి సరైన రోడ్డు బస్సులు లేకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, నిత్యం ప్రయాణించే పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి, చొరవ తీసుకుని నిలిపివేసిన బస్సులను పునరుద్ధరించేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంతాల అంజి రెడ్డి,చొక్కాల శ్రీశైలం, బోయిని మల్లయ్య, కూన మల్లయ్య,కూన లచ్చయ్య, కళ్లెం పోశయ్య, జాలి గోపయ్య,న్యాత రాయనర్సు, వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు








