తిరుపతి – పాకాల: నాయుడుపేట – పూతలపట్టు జాతీయ రహదారిపై (ఎన్.హెచ్ – 71) ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి పరాకాష్ఠకు చేరింది. పాకాల మండలం నేడగుంట – పెనుమూరు క్రాస్ వద్ద ఉన్న ఓవర్ బ్రిడ్జి సమీపంలో అశాస్త్రీయంగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్ ప్రాణాంతకంగా మారింది. రోడ్డు నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో అధికారులు వ్యాపారం చేస్తున్నారని వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రంగుల మాయాజాలం.. మభ్యపెట్టే ప్రయత్నం!
సదరు స్పీడ్ బ్రేకర్ ఎత్తు తీవ్రంగా ఉండి ప్రమాదాలకు నిలయంగా మారిందని, ఎత్తు తగ్గించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు విన్నవించినా అధికారుల్లో చలనం లేదు. సమస్యను పత్రికలు వెలుగులోకి తెచ్చినప్పటికీ, తప్పు దిద్దుకోవాల్సిన ఎన్.హెచ్.ఎ.ఐ యంత్రాంగం కంటితుడుపు చర్యలతో సరిపెట్టుకుంది. శాస్త్రీయంగా బ్రేకర్ ఎత్తు తగ్గించాల్సింది పోయి, కేవలం తెల్లటి పెయింట్ వేసి ఫోటోలకు విజువల్స్ బాగుండేలా చూసుకుని చేతులు దులుపుకున్నారు. “గాయానికి ప్లాస్టర్ వేసినట్లు” సమస్య మూలాన్ని వదిలేసి, పెయింటింగ్‌తో కప్పిపుచ్చే ఈ దారుణ వైఖరి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
నిబంధనలకు నిలువునా తిలోదకాలు:
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐ.ఆర్.సి: 99-2018) నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై స్పీడ్ బ్రేకర్ ఎత్తు గరిష్టంగా 10 సెం.మీ (4 అంగుళాలు) మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ నిర్మించిన బ్రేకర్ ఏకంగా 15 నుండి 20 సెం.మీ ఎత్తులో ఒక మినీ గోడలా దర్శనమిస్తోంది. దీనివల్ల లో-ఫ్లోర్ కార్లు, చిన్న వాహనాల ఇంజిన్ ఛాంబర్లు, సైలెన్సర్లు పగిలిపోయి వాహనదారులకు వేలల్లో నష్టం వాటిల్లుతోంది. ద్విచక్ర వాహనదారులు ఈ ఎత్తైన బ్రేకర్‌ను గమనించక వేగంగా వచ్చి ఎగిరిపడి తీవ్ర గాయాలపాలవుతున్నారు. నిబంధనల ప్రకారం స్పీడ్ బ్రేకర్‌కు 40-50 మీటర్ల ముందే “ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది” అనే బోర్డులు, రేడియం సూచికలు ఉండాలి. ఇవేమీ లేకుండా చీకట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ బ్రేకర్ మృత్యు ఉచ్చులా మారింది.
ఇకనైనా చర్యలు తీసుకుంటారా? ఎంతమంది ప్రాణాలు తీస్తారు?
ప్రాణాలు పోయేంత వరకు అధికారులకు కళ్లు తెరచుకోవా? రోడ్డు భద్రత పేరిట కాంట్రాక్టర్లు చేస్తున్న అడ్డగోలు నిర్మాణాలపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. తక్షణమే ఈ అశాస్త్రీయ బ్రేకర్‌ను తొలగించి, ఐ.ఆర్.సి ప్రమాణాల ప్రకారం సాఫీగా ఉండే వాలుతో పునర్నిర్మించాలని, ముందుగా రేడియం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే దానికి ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.








