గుత్తి, అనంతపురం జిల్లా: పత్రికా విలేకరులపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గుత్తి మండలానికి చెందిన ముగ్గురు విలేకరులతో పాటు అనంతపురం పట్టణానికి చెందిన మరో విలేకరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్న నారాయణ స్వామి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో నలుగురు విలేకరులు గత కొంతకాలంగా తమ సంస్థ కార్యకలాపాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.
కొత్తపేటకు చెందిన భరత్, గుత్తి పట్టణానికి చెందిన షేక్ షావలి, సాయి కృష్ణ, అనంతపురం నగరానికి చెందిన లక్ష్మీనారాయణలు తమ సంస్థపై, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రచురిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు.
తమపై జరుగుతున్న వేధింపులను భరించలేక గతంలో వారికి లక్షలాది రూపాయలు చెల్లించినప్పటికీ వేధింపులు ఆగలేదని నారాయణ స్వామి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తమ వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు కారణమవుతున్నారని ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.
దశాబ్దాలుగా పేదలు, నిరుపేదల కోసం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా నలుగురు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని, బెదిరింపులు కూడా చేస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఫిర్యాదు ఆధారంగా గుత్తి ఎస్సై అమీర్ ఖాన్ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన ఆరోపణలపై విలేకరుల వైపు నుంచి స్పందన రావాల్సి ఉంది. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.








