మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా: బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నదంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న ‘ఓటు చోరీ’ వ్యవహారంలో తానే మొదటి బాధితుడినని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఓటు చోరీకి సంబంధించిన ఆధారాలతో ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్‌రావుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఓటు చోరీ జరుగుతోందని ఆధారాలతో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ స్పందించకపోవడంపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.
బీజేపీకి, నరేంద్ర మోదీకి దేశంలో కాలం చెల్లిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








