గోదావరిఖని : రాజీవ్ హైవేకు సమీపంలోని విషాల్ మెగా మార్ట్ వద్ద రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుపై వాహనాల నిలిపివేతతో ప్రమాదాల ముప్పు కూడా పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ట్రాఫిక్ సీఐ, ఏసీపీ పర్యటించి తప్పుదిశలో ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపివేసి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే రోడ్డుపై వాహనాల పార్కింగ్ సమస్య మాత్రం కొనసాగుతుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో రోడ్డుపై పార్కింగ్‌ను నియంత్రించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాల్ యాజమాన్యం కూడా వాహనాల కోసం సరైన పార్కింగ్ సౌకర్యం కల్పించి, రోడ్డుపై పార్కింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తాజాగా విషాల్ మెగా మార్ట్ వద్ద కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో రాబోయే రోజుల్లో వినియోగదారుల రాకపోకలు, వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించి, ట్రాఫిక్ నియంత్రణతో పాటు పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. రహదారిపై వాహనాల పార్కింగ్‌ను అరికట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








