కొమురం భీం ఆసిఫాబాద్: సిర్పూర్ పేపర్ మిల్లు (SPM) కార్మికుల వార్షిక బోనస్‌కు సంబంధించిన ఒప్పందంపై సమగ్ర విచారణ జరిపి, కార్మికులకు న్యాయమైన బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని SPM కార్మిక సంఘాల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఫోరం నాయకులు బుధవారం వరంగల్ జాయింట్ లేబర్ కమిషనర్ రాజేంద్రప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2022-23 నుంచి 2025-26 వరకు నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వార్షిక బోనస్‌పై 10-మెన్ కమిటీ, యాజమాన్యం మధ్య ముందుగానే ఒప్పందం కుదిరిందని వారు ఆరోపించారు.
మిల్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో సాధించే లాభాలు, కార్మికులకు చట్టబద్ధంగా లభించాల్సిన వాటా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వార్షిక బోనస్‌ను నిర్ణయించాల్సి ఉంటుందని ఫోరం నాయకులు పేర్కొన్నారు. అయితే నాలుగు సంవత్సరాలకు సంబంధించిన బోనస్‌ను ముందుగానే ఒప్పందం చేయడం వల్ల కార్మికులకు నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై కార్మిక శాఖ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, యాజమాన్యం-కార్మిక సంఘాల మధ్య కుదిరిన ఒప్పందం చట్టబద్ధతను పరిశీలించాలని ఫోరం నాయకులు కోరారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికి న్యాయమైన వార్షిక బోనస్ అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ లేబర్ కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.
కార్మికుల హక్కులకు సంబంధించిన అంశంలో అధికారుల విచారణ అనంతరం వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని ఫోరం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.








