జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారయాత్ర శుక్రవారం మెట్‌పల్లి పట్టణంలో కొనసాగింది. ఆగస్టు 6 నుంచి 14 వరకు చేపట్టిన ఈ యాత్ర మెట్‌పల్లి బస్ డిపో నుంచి కొత్త బస్టాండ్ వరకు సాగింది.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి చిన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సూతరి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అందరికీ సార్వత్రిక విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని, రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, కార్మికుల హక్కులను పరిరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్లతోనే జిల్లాలో ఆగస్టు 6 నుంచి 14 వరకు ప్రచారయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై ఆర్థిక భారం మోపాయని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ ప్రచారయాత్రలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.








