తిరుపతి: సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసినా, ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. వాహనాలకు సరి అయిన రికార్డులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నా జప్తు చేస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని ఐదు కార్యాలయ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో ఈ తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ తనిఖీలు 10 రోజులు పాటు కొనసాగుతాయని తెలియజేశారు. వాణిజ్య పరమైన వస్తువులని బస్సులలో తరలించకూడదని ప్రాణుకుల్ని సురక్షితంగా గమ్యాలకి చేర్చాలని తెలియజేశారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాల్ని నడపరాదని , తనిఖీలలో పట్టుబడిన ఎడల తీవ్రమైన చర్యలు తీసుకొని న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని తెలియజేశారు.