గోదావరిఖని : గోదావరిఖని పాత మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రి శిధిలావస్థపై జూలై 30న రిపోర్టర్ టీవీ ప్రచురించిన ప్రత్యేక కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఆస్పత్రి భవనం దుస్థితి, భద్రతా లోపాలు, ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకర పరిస్థితిపై వెలువడిన కథనం నేపథ్యంలో సంబంధిత శాఖలు చర్యలు ప్రారంభించాయి.
జిల్లా పశుసంవర్ధక శాఖ (DVAHO) అధికారి రామగుండం మున్సిపల్ కమిషనర్‌తో సమావేశమై రిపోర్టర్ టీవీలో ప్రసారమైన వీడియోలు, ఫోటోలను చూపిస్తూ ఆస్పత్రి పరిస్థితిని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ ఆస్పత్రికి మూడు నెలల్లో నూతన భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఆస్పత్రి ప్రాంగణంలో ఫెన్సింగ్ లేకుండా బహిరంగంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకర పరిస్థితి నెలకొన్న విషయం కూడా కథనంలో ప్రస్తావించబడింది. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు.
ట్రాన్స్‌ఫార్మర్‌కు భద్రతా కంచె ఏర్పాటు చేయడానికి అవసరమైన కొలతలు ఇప్పటికే తీసుకున్నామని, త్వరలోనే ఫెన్సింగ్ నిర్మించి ప్రమాదాలను పూర్తిగా నివారించేలా చర్యలు చేపడతామని విద్యుత్ శాఖ ఏఈ రిపోర్టర్ టీవీకి తెలిపారు.
అదేవిధంగా, ఆస్పత్రిలో ఉండాల్సిన అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉండటంపై కూడా జిల్లా అధికారులు స్పందించారు. త్వరలోనే ఆ పోస్టును భర్తీ చేసి పూర్తి స్థాయి అధికారిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన రిపోర్టర్ టీవీ కథనానికి అధికారులు వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








