తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం మంగళవారం మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. పులివర్తి నానికి జడ్పీటీసీ నంగా పద్మజా రెడ్డి, ఎంపిడిఓ అరుణ, ఇంచార్జ్ తాసిల్దార్ సంతోష్ సాయి ఘన స్వాగతం పలికారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండలంలోని సమస్యలను అధికారులను, ప్రజాప్రతినిధులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో యుద్ద ప్రాతిపదికన పరిష్కారమయ్యే పనులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రోడ్డు వెడల్పు పనుల్లో స్థలం ఇచ్చిన రైతుకు ధన్యవాదాలు తెలియజేశారు.
12 కోట్ల రూపాయలతో దామలచెరువు – కొమ్మిరెడ్డి గారి పల్లి రోడ్డు వెడల్పుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ళు మంజూరు చేయాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పదిపుట్లబయిలు,పేరసానిపల్లి పరిసర ప్రాంతాలలో ఏనుగుల దాడిలో ధ్వంసం అయిన పంటకు నష్ట పరిహారం త్వరగా రైతులకు పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు.
ముఖ్యంగా రైతులు వాళ్ల సొంత పొలంలో ఉన్న టేకు, వేప చెట్లు వారి అవసరాల నిమిత్తం తీసుకెళితే ఫారెస్ట్ అధికారులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.టేకు, వేప చెట్లు తీసుకువెళ్లే రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వాలని రెవిన్యూ అధికారులకు తెలిపారు. అడవిపల్లి రిజర్వాయర్ నుండి పాకాలకు నీళ్లు తీసుకు రావడానికి ప్రతి పాదనలు కలెక్టర్ కు పంపాలని తెలిపారు. సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఎంపీడీఓ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.