హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (85) మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.
గాదె వెంకటరెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాదె వెంకటరెడ్డి అత్యంత సౌమ్యుడు, సహనశీలి నాయకుడిగా పేరుగాంచారని, ప్రజాహిత కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవారని సీఎం గుర్తుచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన, మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో చూపిన నిబద్ధత, సేవా భావం స్ఫూర్తిదాయకమని అన్నారు.
1940 జులై 10న ప్రకాశం జిల్లా పావులూరులో జన్మించిన గాదె వెంకటరెడ్డి న్యాయశాస్త్రం అభ్యసించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవపై తన ఆసక్తిని చాటుకున్నారు. 1967లో పర్చూరు నియోజకవర్గం నుంచి 27వ ఏటనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత 1991 ఉప ఎన్నిక, 1994లో పర్చూరు నుంచి, 2004 మరియు 2009లో బాపట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య వంటి నేతల మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖతో పాటు పలు కీలక శాఖల మంత్రిగా సేవలందించారు.
తరువాత కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో కూడా కొనసాగారు. విలువలతో కూడిన దీర్ఘకాల రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన గాదె వెంకటరెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.








