చీమకుర్తి మండల కేంద్రంలోని గరికమిట్ట లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న భోజనం మెనూ వివరాలు, వసతి సౌకర్యాలను హెచ్.యం ప్రవీణ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు పట్టిక, పలు రిజిష్టర్లను పరిశీలించారు.వంట గది, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్, విద్యార్థుల నివాస గదులు, తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలో అందుతున్న వసతులు, భోజన వసతులు, అందిస్తున్న విద్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేటి పరిస్థితిలో చిన్న పాటి ఉపాధి కలగాలన్న చదువు అవసరమని, ముఖ్యంగా ఆంగ్ల విద్య వచ్చి వుండాలని, విద్యార్థులు తెలుగు భాషతో పాటు ఆంగ్లం, హింది భాషలపై పట్టు సాధించాలనీ, విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని,రోజువారి సిలబస్తో పాటు విద్యార్థులకు కనీస విషయ పరిజ్ఞానం ఉండేలా ఆంగ్ల బోధన పై విద్యార్థులు నైపుణ్యం సాధించేలా ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించి,ముఖ్యంగా విద్యార్థుల ఆంగ్ల బోధన పటిష్టంగా అమలు చేసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఇదే ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. 2016 సంవత్సరంలో వసతి గృహాన్ని రెసిడెన్షియల్ పాఠశాలుగా మారుస్తూ నూతన భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, నిధులు పూర్తి స్థాయిలో మంజూరు కాకపోవడంతో కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలి పోయాయని, ఈ పాఠశాలలో 3వ తరగతి నుండి 10 వ తరగతి వరకు తరగతి 40 మంది విద్యార్థులతో మొత్తం 320 మంది విద్యార్థులను మంజూరు చేయగా, ప్రస్తుతం అన్నీ తరగతుల్లో కలిపి 134 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో వున్నారని, అలాగే శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకం జరగలేదని, ఆరు మంది ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులతో విద్యను అందించడం జరుగు చున్నదని పాఠశాల ప్రిన్సిపాల్ కమీషన్ సభ్యులకు వివరించారు.
కమీషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ మాట్లాడుతూ, పుట్టిన ప్రతి బిడ్డకు చదువు అవసరమని, అలాగే జబ్బు వస్తే వైద్యం అవసరమని, సమాజంలో వెనుకబడిన గిరిజనులు,ఆదివాసీలకు విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో గిరిజన పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు అందుతున్న విద్య, కల్పిస్తున్న వసతులను పరిశీలించేందుకు అలాగే గ్రామ స్థాయిలో వున్న యానాది కాలనీల్లో గిరిజనులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను తెలుసుకోవడానికి ఈ రోజు ప్రకాశం జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందని, రాష్ట్రంలో 9 జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సభ్యులు వెంట కమీషన్ డైరెక్టర్ పి. కళ్యాణ్ రెడ్డి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథ రావు పాల్గొన్నారు.