- కులవివక్ష, సామాజిక అసమానతలపై గుర్రం జాషువా చేసిన అలుపెరుగని పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం: ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా.
- సామాజిక అభ్యున్నతికి గుర్రం జాషువా చేసిన కృషి ఎంతో వెలకట్టలేనిది: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
జాషువా 129వ జయంతిని పురస్కరించుకొని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రకాశం భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ పాల్గొని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంఘ సంస్కరణ కోసం సాహిత్యాన్ని ఆయుధంగా వాడుకొని జాషువా ఎన్నో గొప్ప రచనలు చేశారని కొనియాడారు. కవిగా, స్వాతంత్య్ర్య పోరాట యోధునిగా, సంఘ సంస్కర్తగా విశేష కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జాషువాను స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కవిగా, మానవతావాదిగా సామాజిక అభ్యున్నతికి గుర్రం జాషువా చేసిన కృషి ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. వంటి సివిల్ సర్వీసులకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు కూడా జాషువా రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ కొనియాడారు.
అనంతరం జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్.గోపాలకృష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తెలుగు సాహిత్య రంగంపై గుర్రం జాషువా తనదైన ముద్ర వేశారని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, డి.ఎం.హెచ్.ఓ .సురేష్ కుమార్, ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు, గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షలు ఉసురుపాటి బ్రహ్మయ్య, కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్, ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర కో-కన్వీనర్ పానుగంటి షాలేమురాజు, ప్రకాశం జిల్లా అద్యక్షులు రావినూతల కోటి, ఎం.ఎస్.పి.ఎస్. అద్యక్షులు కొమ్ము సుజన్, కవులు కత్తి కళ్యాణ్, గంగవరపు సునీత, సామాజిక ఉద్యమకారులు సుధాకరబాబు, అంగలకుర్తి ప్రసాద్, శ్రీరామ్ కౌచ్ సాగర్, నేదరపల్లి జయరాజు, రేనమాల మాధవ, శరత్, చంద్రబోసు, గరటయ్య, తదితరులు పాల్గొన్నారు.