- రూ.1.70 కోట్లకు పైగా బకాయిల ఆరోపణలు.. ఎమ్మెల్యేను కలిసిన 53 మంది బాధిత రైతులు
మాచర్ల: కారంపూడి మండలంలోని మిర్చి రైతులకు అండగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారు. రైతులను ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా వారి పక్షాన నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.
కారంపూడి మండలంలోని గాదెవారిపల్లి, పెదకొదమగండ్ల, చినకొదమగండ్ల, భట్రువారిపల్లి, ఇనుపరాజుపల్లి, కాచవరం తదితర గ్రామాలకు చెందిన సుమారు 53 మంది మిర్చి రైతులు శనివారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. మిర్చి వ్యాపారం నిర్వహించే చల్లా అయ్యప్పకు పంటను విక్రయించగా, తమకు చెల్లించాల్సిన రూ.1.70 కోట్లకు పైగా నగదు బకాయిలు ఉన్నాయని రైతులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి తమ సమస్యను వివరించామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కారంపూడి ఎస్సై వాసు రైతుల పక్షాన నిలిచి తమకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు.
రైతుల కథనం ప్రకారం.. తమ వద్ద నుంచి కొనుగోలు చేసిన మిర్చిని గుంటూరు మిర్చి యార్డులో విక్రయించి, మే 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు సుమారు రూ.1.40 కోట్ల వరకు వ్యాపారి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అయితే రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా వివిధ కారణాలు చూపుతున్నారని వారు ఆరోపించారు.
ఇదే క్రమంలో వ్యాపారి ఇంట్లో లెక్కలు పరిశీలిస్తున్న సమయంలో ఆయన భార్య చల్లా లక్ష్మి పురుగుమందు విషయంలో హైడ్రామాకు పాల్పడినట్లు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వాసు తనను వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించి ఆసుపత్రికి వెళ్లిన ఘటన కూడా చోటుచేసుకుందని తెలిపారు. అయితే ఈ ఆరోపణలు, ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
పంటను విక్రయించిన డబ్బులు అందకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే పంట కోసం కౌలు భూములు తీసుకునేందుకు కూడా డబ్బులు లేకపోతున్నాయని, పిల్లల చదువుల ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఎమ్మెల్యేకు వివరించారు.
రైతుల సమస్యలను సానుభూతితో విన్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యంగా ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన వంతుగా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.
అలాగే రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన వారితో పాటు, వ్యాపారికి సహకరిస్తున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై కూడా చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.








