contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పహల్గామ్ దాడి వెనుక భారీ కుట్ర: విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

జర్మనీ : జమ్మూకశ్మీర్‌, పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి వెనుక పెద్ద కుట్ర ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, కశ్మీర్‌లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం, దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. బెర్లిన్‌లో జరిగిన డీజీఏపీ సెంటర్ ఫర్ జియోపాలిటిక్స్, జియోఎకనామిక్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదం విషయంలో భారత్ ఏమాత్రం సహించబోదని, అణు బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని జైశంకర్ తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అవలంబిస్తున్న నూతన విధానాల గురించి జర్మనీ అగ్ర నాయకత్వానికి వివరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా సమర్థించదని, అన్ని దేశాలు ఖండించాయని ఆయన గుర్తుచేశారు. పహల్గామ్ దాడిని జర్మనీ కూడా తీవ్రంగా ఖండించిందని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా నిలుస్తుందని తెలిపిందని జైశంకర్ పేర్కొన్నారు. తమ పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలపైనే భారత్ దాడులు చేసిందని, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ ప్రాయోజిత విధానంగా వాడుకుంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదంపై పోరాడే హక్కు భారత్‌కు ఉందని జర్మనీ గుర్తించిందని జైశంకర్ తెలిపారు.

పాకిస్థాన్‌తో వ్యవహారాల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఆస్కారమే లేదని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని ఆయన గట్టిగా చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుందని, పాకిస్థాన్‌తో సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

భారత్, జర్మనీ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, రాబోయే 25 ఏళ్లలో ఈ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జైశంకర్ అన్నారు. రక్షణ, భద్రత, ప్రతిభావంతుల రాకపోకలు, సాంకేతికత, కృత్రిమ మేధ, సుస్థిరత, హరిత అభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న చిప్స్ వార్, వాతావరణ మార్పులు, పేదరికం, కొవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్-జర్మనీ భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్ మాట్లాడుతూ, గత నెలలో పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రదాడి తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, పౌరులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటానికి జర్మనీ మద్దతు ఇస్తుందని, ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదానికి స్థానం ఉండకూడదని ఆయన అన్నారు. ఇరు దేశాలు నియమాల ఆధారిత ప్రపంచ వ్యవస్థను కాపాడాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకుంటున్నాయని వాడెఫుల్ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో భద్రతా విధానంలో భారత్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :