- కాకినాడలో మద్యం, గంజాయి, గుట్కా నియంత్రణలో విఫలం.. ఇప్పుడు బీచ్ షాక్స్ ఎందుకు?
- సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆందోళన
కాకినాడ జిల్లాలో ఇప్పటికే మద్యం దుకాణాలు, బార్లు, అనధికార బెల్ట్ షాపులు, గంజాయి, గుట్కా, అక్రమ సారా విక్రయాలు విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి పేరుతో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడం యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతుందని ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
కాకినాడ ఎన్‌టీఆర్ బీచ్‌లో గురువారం ఉదయం “బీచ్ షాక్స్ వద్దు.. సముద్ర తీరాల్లో యువతరాన్ని నాశనం చేయవద్దు” అనే నినాదాలతో ప్లకార్డు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మద్యం, మాదకద్రవ్యాల వినియోగం ఇప్పటికే ఆందోళనకర స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 362 లక్షల కేసుల మద్యం విక్రయాలు నమోదుకాగా, 2025-26లో అవి 414 లక్షల కేసులకు చేరుకున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు విక్రయాలు పెరిగాయని, మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.37,487 కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
జనాభా ప్రాతిపదికన కాకినాడ జిల్లాలోనే ఏటా సుమారు రూ.1,425 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతోందని, సిండికేట్ విధానాల కారణంగా వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో వందల సంఖ్యలో బెల్ట్ షాపులు ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
యువతపై మద్యం ప్రభావం తీవ్రంగా ఉందని, ముఖ్యంగా 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అధికంగా వ్యసనాలకు గురవుతున్నారని రమణరాజు పేర్కొన్నారు. గతంలో 22 నుంచి 25 ఏళ్ల వయస్సులో మద్యం అలవాటు మొదలయ్యేదని, ప్రస్తుతం 15 నుంచి 19 ఏళ్ల వయస్సులోనే యువత వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే గంజాయి, లిక్విడ్ గంజాయి, హాష్ ఆయిల్ వంటి మాదకద్రవ్యాలు కూడా యువతకు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కాకినాడ మీదుగా భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని, ప్రతి సంవత్సరం వందల కేసులు నమోదవుతున్నప్పటికీ సరఫరా తగ్గడం లేదని తెలిపారు.
అక్రమ గుట్కా వ్యాపారం కూడా కోట్ల రూపాయల స్థాయిలో కొనసాగుతోందని, యానాం, ఓడరేవు, బెంగళూరు మార్గాల ద్వారా భారీ ఎత్తున గుట్కా రవాణా జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల యువత మద్యం, గంజాయి, గుట్కా వంటి వ్యసనాల బారిన పడుతున్నారని చెప్పారు.
బీచ్ రోడ్, జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో అధిక శాతం మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రతి ఏడాది వేల సంఖ్యలో నమోదవుతుండగా, జరిమానాల రూపంలో కోట్ల రూపాయలు వసూలవుతున్నాయని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకాభివృద్ధి కంటే మద్యం, మాదకద్రవ్యాల వినియోగం మరింత పెరిగే ప్రమాదం ఉందని రమణరాజు హెచ్చరించారు. యువత భవిష్యత్తు, సమాజ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీచ్ షాక్స్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర సామాజిక, రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, ప్రజారోగ్యం మరియు యువత సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.








