కారంపూడి: పల్నాడు జిల్లా కారంపూడి పట్టణ పరిధిలోని పేటసన్నిగండ్ల శివారులో బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సును కోళ్లను రవాణా చేస్తున్న టాటా మ్యాక్స్ వాహనం ఢీకొట్టింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టాటా మ్యాక్స్ ఢీకొనడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.
అయితే ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు, వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదానికి గురైన టాటా మ్యాక్స్ వాహనం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ఓ కోళ్ల ఫారం యజమానికి సంబంధించినదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ యజమానికి చెందిన వాహనం గతంలో కూడా ప్రమాదానికి గురైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. బైక్‌పై వెళ్తున్న వారిని ఆ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.
వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కోళ్ల ఫారాలకు చెందిన రవాణా వాహనాల డ్రైవింగ్‌పై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాహనాలను మైనర్లు నడుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
తాజా ప్రమాదంపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. డ్రైవర్ అర్హత, వాహన వేగం, అనుమతులు తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.








