కామారెడ్డిలో: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ఐవీఎఫ్ సేవాదళ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదిత్య హాస్పిటల్ సహకారంతో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి అనంతోజి కాలీడస్‌లో ఈ రక్తదాన శిబిరం జరగనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆదిత్య హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి, ఆదిత్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అజయ్ పేరాల విడుదల చేశారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తలసేమియా చిన్నారులకు జీవనాధారంగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. తలసేమియా బాధిత చిన్నారులకు తరచుగా రక్తం అవసరం అవుతుందని, ఆ అవసరాన్ని తీర్చేందుకు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరిస్తున్న ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు, వైద్యులకు ఐవీఎఫ్, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
రక్తదానంలో పాల్గొనే తొలి వందమంది రక్తదాతలకు హెల్మెట్లు, ప్రశంసా పత్రాలు, కీచైన్లు అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9492874006, 9885707042 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, సలహాదారులు మందుల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.








