కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందినట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బ రాయుడు అన్నారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు, మధ్యదలారీలు రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని తెలిపారు.రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ముందస్తు చర్యలకై కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నకిలీ విత్తనాల నియంత్రణకై కరీంనగర్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా టాస్క్ ఫోర్స్ ఏసిపి ఫోన్ నంబర్ 8712670760, ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 87126 70708 లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతారని చెప్పారు. నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాల వ్యవహారంలో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా సంబంధం ఉన్న వ్యాపారులు, వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనరేట్ వ్యాప్తంగా స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలకు చెందిన పోలీసులు నకిలీ విత్తనాల విక్రయాల నియంత్రణకు తనిఖీలను నిర్వహించనున్నారని చెప్పారు.
