కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై తక్షణమే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి, అవసరమైతే రివార్డు ప్రకటించి అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్‌లోని తన నివాసం ‘ప్రాణహిత నిలయం’లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మైనర్ బాలిక ఫిర్యాదుతో కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయకపోవడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. నిందితుడికి పోలీసులు సహకరిస్తున్నారని, బాధితురాలిని భయభ్రాంతులకు గురి చేయడానికే అరెస్ట్‌లో జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గంటల సమయం తీసుకున్న పోలీసులు, నిందితుడు ఫిర్యాదు చేయగానే నిమిషాల్లో స్పందించడం ఏమిటని ప్రశ్నించారు.
సాధారణ సెక్షన్లు కాకుండా, కనీసం 20 సంవత్సరాల శిక్ష పడేలా పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని, బండి సంజయ్‌తో ఉన్న రాజకీయ సాన్నిహిత్యం కారణంగానే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.
బీజేపీ “భేటీ బచావో” అని చెబుతుంటే, కేంద్ర మంత్రి మాత్రం “బేటా బచావో” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బాధితురాలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారైనా, కొందరు కుల సంఘాలు నిందితుడికి మద్దతు తెలపడం బాధాకరమన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు స్పందించి మైనర్ బాలికకు న్యాయం జరిగేలా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.








