తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు ప్రగతి భవన్, ఫాంహౌస్ కూడా దాటడంలేదని అన్నారు. కేసీఆర్ డబ్బుల సంచులు పట్టుకుని ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని, కేసీఆర్ తీరు చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.
నిరుద్యోగ భృతిపై ఏంచేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆయా కార్యాలయాల్లో అధికారులు ఈగలు తోలుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. కేసీఆర్ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల తీరే అంత… వారు చెప్పింది చేయరు… చేయని దాని గురించే చెబుతారని విమర్శించారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై గందరగోళం సృష్టిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలు విద్యుత్ ఉత్పాదక సంస్థల పరిరక్షణ కోసమేనని, విద్యుత్ సంస్థలు పతనమైతే దేశం కుప్పకూలుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పడిపోతుందని, డిస్కంలు దివాళా తీస్తాయని అన్నారు.