కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు మాట్లాడుతూ, మండలంలో పొద్దుతిరుగుడు పంటకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం కేంద్రాలు లేకపోవడంతో రైతులు తమ పంటను దూర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందని, దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి అదనపు భారం పడుతోందని తెలిపారు. అలాగే దళారులకు అమ్ముకోవాల్సి రావడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చొరవ తీసుకుని గన్నేరువరం మండలంలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది రైతులు ఈ పంటను సాగు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతల అంజిరెడ్డి, మండల కార్యదర్శి చోక్కల శ్రీశైలం, సహాయ కార్యదర్శి కూన మల్లయ్య, గన్నేరువరం మండల శాఖ కార్యదర్శి బోయిని మల్లయ్య, మండల నాయకులు ఎండి నయీమ్, రాపోలు రాజమల్లు, బుట్ల భాస్కర్, చోక్కల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.








