గన్నేరవరం మండల కేంద్రంలో చోటుచేసుకున్న భూవివాదం, కులాహంకార వేధింపులు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాతముత్తాతల కాలం నుంచి సుమారు వంద సంవత్సరాలుగా అదే ప్రాంతంలోని నివాసముంటున్న ఎస్టీ ఎరుకల కులానికి చెందిన కుర్ర మనీషా -భర్త హరీష్ నిరుపేద కుటుంబంపై స్థానిక పెత్తందార్లు సాగిస్తున్న అరాచకాలు హద్దు మీరుతున్నాయి. జీవనాధారమైన గూడును, వందేళ్ల స్థలాన్ని లాక్కోవడానికి జరుగుతున్న ఈ కుట్రపై శుక్రవారం ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
భూమికి వందేళ్ల చరిత్ర – పత్రాలు ఉన్నా వేధింపులు: గత వంద సంవత్సరాలుగా (తాత ముత్తాతల కాలం నుంచి) సర్వే నంబర్ 18లోని సుమారు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆనుకుని నివాసముంటున్న ఈ కుటుంబానికి సంబంధించిన భూమి పత్రాలు, కాగితాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే కొందరు పెత్తందార్లు కక్ష కట్టారు.
వీఓ బిల్డింగ్ వివాదం – కక్ష సాధింపు: వీఓ బిల్డింగ్ నిర్మాణం కోసం గతంలో సదరు బాధితుడి స్థలాన్ని బలవంతంగా ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అతను ఒప్పుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆ కుటుంబంపై స్థానికులు కక్ష పెంచుకున్నారు.
రాత్రివేళ మా ఇంటిపై దాడులు – కులాహంకార బహిష్కరణ: ఒక రోజు రాత్రి సమయంలో బాధితుడిపై భౌతిక దాడికి దిగడమే కాకుండా, గ్రామం నుంచి బహిష్కరిస్తామని, ఊళ్లో తిరగనివ్వమని, ప్రాణాలు తీస్తామని మోటు మాటలతో కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారి కుల వృత్తిని సైతం అడ్డుకుంటూ తీవ్రమైన కుల వివక్ష చూపుతున్నారు.
అధికారుల ఉదాసీనత: ప్రభుత్వం ప్రకారం మూడు సంవత్సరాలు భూమిలో ఉంటే పట్టా ఇవ్వాల్సి ఉండగా, వందల ఏళ్లుగా ఉంటున్న ఈ ఎస్టీ కుటుంబానికి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా, రక్షణ కల్పించాల్సిన పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తూ భయాందోళనకు గురిచేస్తోంది.
న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన: ఈ ఘటనపై బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ – వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా నాయకులు మాతంగీ శంకర్ తీవ్రంగా స్పందించారు. బాధితుల కుటుంబానికి వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, సమగ్ర సర్వే నిర్వహించి పూర్తి స్థాయి హక్కులు కల్పించాలీ. వారిపై ఎస్సి ఎస్టీ కేసులు చేయాలనీ డిమాండ్ చేశారు.స్థానిక ఎస్సై, సీఐ, ఏసీపీ, సీపీ అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని, ఆందోళనలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.








