రామాయంపేట – తూప్రాన్ : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని కేఎస్ఆర్ కాలనీకి చెందిన ముగ్గురు బాలురు కనిపించకుండా పోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎస్ఆర్ కాలనీకి చెందిన మెక్కొండ అశ్విని అలియాస్ సోనీ (భర్త: వెంకటేష్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమారుడు ధనుష్ (13) రామాయంపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అదే కాలనీకి చెందిన మనోజ్ (13), షేక్ సమీర్ (13) కూడా వరుసగా 8వ, 9వ తరగతులు చదువుతున్నారు.
గురువారం (ఆగస్టు 6) రాత్రి సుమారు 9 గంటల వరకు ముగ్గురు బాలురు కాలనీలో కలిసి ఆడుకుంటూ కనిపించారు. అనంతరం ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మెక్కొండ అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన రామాయంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుర ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి
ఈ ముగ్గురు బాలుర గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే రామాయంపేట పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.
- రామాయంపేట ఎస్ఐ: 8713667934
- రామాయంపేట సీఐ: 8712657933
బాలుర ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించి వారి కుటుంబాలకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.








