జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఆర్.టి.సి డిపో ఆధ్వర్యంలో జరిపిన డ్రైవర్స్ డే కార్యక్రమం లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెట్ పల్లి డిఎస్పీ రాములు మాట్లాడుతూ, సురక్షితంగా వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా, ఆర్.టి.సి డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రైవర్స్ డే ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధులలో నిర్వహించబడింది. ఈ ర్యాలీ లో విద్యార్థులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పలువురు డ్రైవర్లకు పువ్వుల మాళికలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మెట్ పల్లి బస్ డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ, “జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా డ్రైవర్స్ డే నిర్వహించి, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామన్నారు. డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళ్లడంలో డ్రైవర్లది అత్యంత కీలకమైన పాత్ర. వారు అప్రమత్తంగా ఉంటే, రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని” అన్నారు.
ఆర్.టి.సి డిపోలో నిష్ణాతులైన డ్రైవర్ల జాబితా ఉందని, ప్రయివేటు వాహనాలతో పోలిస్తే, ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చాలా సురక్షితమని తెలిపారు. “రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఆర్.టి.సి ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము” అని ఆయన చెప్పారు.