హైదరాబాద్ – నగరంలో ఐపీఎల్ సందడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నెల 22న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో టికెట్ల కోసం అభిమానులు పోటీపడుతున్నారు. అయితే, ఈ క్రేజ్‌ను అవకాశంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు.
నకిలీ యాప్‌లు, క్లోన్ వెబ్సైట్ల ద్వారా ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో తక్కువ ధరలకు టికెట్లు ఇస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ అధికారిక టికెటింగ్ భాగస్వామి ‘డిస్ట్రిక్ట్’ యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లను సృష్టించి, ప్రజలను మోసం చేస్తున్నారు.
అసలు యాప్‌ల మాదిరిగానే లోగోలు, డిజైన్లు ఉపయోగిస్తూ ప్రీమియం స్టాండ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ లింకులు లేదా ఏపీకే ఫైల్స్ రూపంలో పంపిస్తూ, డౌన్లోడ్ చేసుకునేలా ప్రలోభపెడుతున్నారు. టికెట్లు బుక్ చేసే సమయంలో బాధితుల బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో కనిపించే అనధికారిక టికెట్ ప్రకటనలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. నకిలీ లింకుల ద్వారా టికెట్లు బుక్ చేస్తే డబ్బులు కోల్పోవడమే కాకుండా బ్యాంకు ఖాతాల భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
మ్యాచ్ టికెట్ల కోసం బ్లాక్ మార్కెట్ ప్రకటనలు, అనుమానాస్పద వెబ్సైట్లు, తెలియని యాప్‌లను నమ్మొద్దని ఆయన సూచించారు. అధికారిక వేదికల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింకులు లేదా మోసపూరిత ప్రకటనలు కనిపిస్తే వెంటనే డయల్ 1930 లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఐపీఎల్ ఉత్సాహంలో అప్రమత్తత కోల్పోతే ఆర్థిక నష్టం తప్పదని, అభిమానులు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.








