వాహనం నడుపుతూ వెళ్లే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) వంటి కీలక పత్రాలను ఇంట్లో మరిచిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీకి ఆపితే వెంటనే జరిమానా చెల్లించాల్సిందేనని చాలా మంది భావిస్తుంటారు. అయితే కేంద్ర మోటారు వాహన నిబంధనలు (CMVR), 1989లోని రూల్-139 ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాహనదారులకు ఉపశమనం కల్పించే అవకాశం ఉంది.
రూల్-139 ప్రకారం, తనిఖీ సమయంలో అవసరమైన వాహన పత్రాలు తమ వద్ద లేకపోయినా, అవి చెల్లుబాటులో ఉన్నట్లయితే సంబంధిత అధికారికి 15 రోజుల లోపు సమర్పించే అవకాశం కల్పించబడింది. అంటే పత్రాలు నిజంగా ఉండి, కేవలం వెంట తీసుకురావడం మరిచిపోయిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది.
ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఇన్సూరెన్స్, పీయూసీ వంటి పత్రాలు చెల్లుబాటులో ఉండి, భౌతిక కాపీలు ఇంట్లో మిగిలిపోయినా లేదా మొబైల్ ఫోన్ అందుబాటులో లేక డిజిలాకర్, ఎం-పరివాహన్ యాప్‌లలో చూపించలేని పరిస్థితుల్లో ఈ నిబంధన ఉపయోగపడుతుంది.
అయితే ఈ నిబంధనను తప్పుగా అర్థం చేసుకోవద్దని రవాణా నిపుణులు సూచిస్తున్నారు. పత్రాలు లేకుండా వాహనం నడపడానికి ఇది అనుమతి కాదని, అన్ని వాహన పత్రాలు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. తనిఖీ సమయంలో చూపించలేకపోయినా, అనంతరం వాటిని నిర్దేశిత గడువులో అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
వాహనదారులు డిజిలాకర్ లేదా ఎం-పరివాహన్ వంటి డిజిటల్ వేదికల్లో తమ పత్రాలను భద్రపరచుకోవడం ద్వారా ఇలాంటి ఇబ్బందులను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ పత్రాలకు కూడా చట్టబద్ధ గుర్తింపు ఉండటంతో ప్రయాణ సమయంలో అవి ఎంతో ఉపయోగకరంగా మారాయి.









