పార్వతీపురం – జియ్యమ్మవలస : జియ్యమ్మవలస మండలంలోని రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పరిధిలో దోమతెరల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా కొనసాగింది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పీహెచ్సీ వైద్యులు డాక్టర్ దిలీప్ కుమార్, డాక్టర్ కె. సుస్మిత తెలిపారు.
ఈ సందర్భంగా ఉపకేంద్రాల వారీగా దోమతెరల పంపిణీ వివరాలను వెల్లడించారు. అలమండ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు కేటాయించిన 183 దోమతెరల్లో 99 ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చినతోలుమండలో 174 దోమతెరల్లో 90 పంపిణీ చేయగా, చినతోలుమండగూడలో కేటాయించిన 9 దోమతెరలను పూర్తిగా పంపిణీ చేశారు.
కొండచిలకాం ఆరోగ్య కేంద్ర పరిధిలో 195 దోమతెరలకు గానూ 32 పంపిణీ చేయగా, బల్లెరుగూడలో 64లో 32 పంపిణీ పూర్తయింది. కురుపాం-1 ఉపకేంద్రంలో 3,119 దోమతెరల లక్ష్యంతో ఇప్పటివరకు 200 పంపిణీ చేశారు.
పెదతోలుమండ కేంద్రానికి 631 దోమతెరలు కేటాయించగా, ప్రస్తుతం 420 స్టాక్ అందుబాటులో ఉంది. ఇక్కడ పంపిణీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అలాగే ద్రాక్షిణి ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన 131 దోమతెరల పంపిణీ కూడా ప్రారంభ దశలో ఉంది.
మొత్తంగా పీహెచ్సీ పరిధిలో 4,832 దోమతెరలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 614 దోమతెరలు ఉపకేంద్రాలకు చేరాయి. అందులో 221 మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది.
దీర్ఘకాలం ఉపయోగపడే ఈ దోమతెరలు వ్యాధుల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలు తప్పనిసరిగా వీటిని వినియోగించుకోవాలని వైద్యులు సూచించారు.








