పార్వతీపురం – గుమ్మలక్ష్మీపురం : శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యాన్ని నమ్మి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు సూచించారు. “నాటు వైద్యానికో నమస్కారం”, “లార్వా వేట” కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో శనివారం గొరడ గ్రామంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కరరావు ప్రోగ్రాం అధికారులతో కలిసి పాల్గొని ప్రజలకు పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. నాటు వైద్యాన్ని నిరోధించడం, జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యంగా జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
నాటు వైద్యం వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలు ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉందని, కొన్నిసార్లు ప్రాణహాని కూడా సంభవించే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు గ్రామస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను సంప్రదించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, సమీప ఆరోగ్య కేంద్రాల్లోనే చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడంలో భాగంగా “లార్వా వేట” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దోమల లార్వాలను గుర్తించి నిర్మూలించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. లార్వా శాంపిల్స్‌ను గ్రామస్తులకు, చిన్నారులకు చూపించి వాటి ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది “నాటు వైద్యానికో నమస్కారం” అనే అంశంపై ప్రదర్శించిన లఘునాటిక గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అనంతరం రేగడి పీహెచ్సీలో రేగిడి, దుద్దుఖల్లు ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అమలుపై నివేదికలను పరిశీలించి, ప్రజారోగ్యమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సూర్య కౌశిక్, డీఎంఓ డి. సూర్యనారాయణ, వైద్యాధికారులు డాక్టర్ బి. రాజ్ మనోహర్, డాక్టర్ దిలీప్ కుమార్, డిప్యూటీ డెమో గిరిబాబు, ఇంచార్జి డీపీఎచ్హెచ్ఎంఓ విజయలక్ష్మి, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణంరాజు, పెంటమ్మ, రాజేశ్వరి, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.








