contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి: తోయక జగదీశ్వరి

కురుపాం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తీవ్రంగా ఖండించారు. గురువారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న హోంమంత్రి అనితపై బాధ్యతారహితంగా, అవమానకరంగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళల గౌరవం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, మహిళా సాధికారతను సహించలేకనే వైసీపీ నాయకులు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు గాను గుడివాడ అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తోయక జగదీశ్వరి డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చట్ట పరిపాలనను బలోపేతం చేస్తూ నేరాలకు పాల్పడిన వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంటే దానిని రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, అక్రమ అరెస్టులు, ప్రతిపక్ష నాయకులపై నమోదు చేసిన తప్పుడు కేసుల గురించి ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని గుడివాడ అమర్నాథ్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల భద్రత కోసం సమర్థవంతంగా పనిచేస్తున్న హోంమంత్రి అనితపై వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నాయకుల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.

హోంమంత్రి అనితను అవమానించడం అంటే రాష్ట్ర మహిళా లోకాన్ని అవమానించినట్టేనని, మహిళల గౌరవాన్ని కించపరిచే చర్యలను ప్రజలు సహించరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చట్టం అమలు వైసీపీకి కక్షసాధింపుగా కనిపించవచ్చని, కానీ ప్రజలకు అది న్యాయం, భద్రత కల్పించే చర్యగా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి బిడ్డిక పద్మావతి, కురుపాం మార్కెటింగ్ కమిటీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, నియోజకవర్గ మహిళా విభాగ కార్యదర్శి వెంపటాపు భారతి, తెలుగు మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :