గ్రామంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట పంచాయతీ పరిధిలోని పనసలపాడు గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 12 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు సీసీ రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామస్థుల వివరాల ప్రకారం, వర్షాకాలం ప్రారంభమైనప్పుడల్లా గ్రామమంతా బురదమయంగా మారిపోతుందని, భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ఇతర గ్రామాల్లో కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు నిర్మించినట్లు ప్రచారం జరుగుతుండగా, తమ గ్రామాన్ని మాత్రం అధికారులు విస్మరిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు.
“మేము గిరిజనులమని మా గ్రామానికి కనీస సీసీ రోడ్డు కూడా వేయడం లేదు. మా సమస్యను పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. పీఆర్ అండ్ ఆర్డి అధికారులు గ్రామాన్ని పరిశీలించి అంచనాలు కూడా సిద్ధం చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు” అని గ్రామస్తులు వాపోయారు.
సీసీ రోడ్డు లేకపోవడంతో విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, తక్షణమే నిధులు విడుదల చేసి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో గేమిల చిన్నబ్బాయి, గెమిల దేవుడమ్మ, గేమిల చందర్రావు తదితర గ్రామస్తులు, మహిళలు పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు.








