జగిత్యాల : సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రజా సమాచార అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిధిలో పెండింగ్లో ఉన్న సుమారు 100 RTI కేసులను పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు కలిపి సుమారు 250 మంది పాల్గొన్నారు.
చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా సమాచార హక్కు చట్టం అమలులో ఉందని, దరఖాస్తులు స్వీకరించడం, కేసుల పరిష్కారం, అవగాహన కల్పించడం వంటి అంశాలపై నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 20 జిల్లాల్లో పర్యటించామని, సుమారు 16 వేల కేసులను విచారించామని చెప్పారు.
జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దరఖాస్తులు పెరగడంతో పాటు సమాచారాన్ని త్వరగా పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న సమాచారం ప్రజలకు తప్పకుండా అందుబాటులో ఉంచాలని, అడిగినప్పుడు మాత్రమే కాకుండా అవసరమైన సమాచారాన్ని స్వచ్ఛందంగా కూడా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే 41B నిబంధనల ప్రకారం ప్రతి శాఖ గత ఏడాది సేవలు, భవిష్యత్ ప్రణాళికలను నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మందికి అవగాహన కల్పించామని, అవగాహన పెరిగిన జిల్లాల నుంచి RTI దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాస్, దేశాల భూపాల్, జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








