మెదక్ జిల్లా – తూప్రాన్ : తూప్రాన్ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి-44 (ఎన్‌హెచ్-44) వెంట ఉన్న ధాబాలపై పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కొన్ని ధాబాలలో అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ మేరకు మొత్తం ఆరు ధాబాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెలుగు అరోమా ధాబా నిర్వాహకుడు గొల్ల మాధవ్, వినోద్ ధాబా నిర్వాహకుడు వినోద్ అజ్మీరా, న్యూ రెడ్డి ధాబా నిర్వాహకుడు అంజి రెడ్డి, శివరెడ్డి ఫ్యామిలీ ధాబా నిర్వాహకుడు రామ్ రెడ్డి, మనీషా ధాబా నిర్వాహకుడు గొల్ల బాలేష్, రెడ్డి ఫ్యామిలీ ధాబా నిర్వాహకుడు సతీష్ రెడ్డిలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. హోటళ్లు, ధాబాలు, రెస్టారెంట్లు మరియు ఇతర వాణిజ్య సంస్థల్లో అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతించినట్లయితే సంబంధిత నిర్వాహకులు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా శాంతిభద్రతలు, చట్టపాలన పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్, తూప్రాన్ ఎస్‌ఐతో పాటు ఇతర ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.








