కొల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు తిరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కోల్‌కతాలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనుండగా, ఆయనే రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అసెంబ్లీ రద్దుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం
పశ్చిమ బెంగాల్ 17వ శాసనసభ పదవీకాలం గురువారంతో ముగియడంతో గవర్నర్ అసెంబ్లీని మే 7 నుంచి రద్దు చేస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే అసెంబ్లీ రద్దయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఇప్పటికీ ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’ హోదానే కొనసాగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భవానీపూర్‌లో మమతకు షాక్
ఈ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో 15,105 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇక ఇదే నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వారి సంఖ్య 45,240గా నమోదైనట్లు సమాచారం. ఈ సంఖ్య మమత ఓటమి మార్జిన్‌కు మూడు రెట్లు ఎక్కువగా ఉండటంతో ఎన్నికల నిర్వహణపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
రాజకీయంగా ఉత్కంఠ
రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎలా ఉండబోతోందన్న అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నికల ప్రక్రియపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం న్యాయపరమైన మలుపు తిరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.








