న్యూఢిల్లీ, మే 21: వక్ఫ్ అనేది దాతృత్వ వ్యవస్థ మాత్రమేనని, అది ఇస్లాం మతంలో అనివార్య భాగం కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు స్పష్టంచేసింది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు.
“వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావన కావొచ్చు. కానీ ఇది మతపరమైన మూలసూత్రం కాదు. ఇది దాతృత్వం. ప్రతి మతంలో దానధర్మాలు ఉన్నాయి. హిందూమతంలో దానధర్మాలు ఉంటే, సిక్కులు కూడా అలాంటి వ్యవస్థ కలిగి ఉన్నారు. ప్రభుత్వ భూములపై ఎవరూ హక్కు చూపలేరు. వక్ఫ్‌గా ప్రకటించినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తి వారి ఆధీనంలోకి వెళ్లదు.” అని మెహతా తెలిపారు.
లౌకిక వ్యవస్థలో వక్ఫ్ బోర్డులు – మతపరమైనవి కావు
వక్ఫ్ బోర్డులు మతపరమైన కాదు, లౌకిక విధులు నిర్వహించే సంస్థలని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో బ్రిటిష్ పాలన నుండి ఇప్పటి వరకూ ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలను, తాజా వక్ఫ్ సవరణ చట్టం పరిష్కరించేందుకు ప్రయత్నించిందని కేంద్రం పేర్కొంది.
“1923 నుంచి కొనసాగుతున్న ముప్పును మేము తొలగించేందుకు చట్టాన్ని సవరిస్తున్నాం. అన్ని వాటాదారుల వాదనలు గౌరవించాం. కొంతమంది పిటిషనర్లు తామే మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పలేరు. మాకు 96 లక్షల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలిపారు. JPC మొత్తం 36 సమావేశాలు నిర్వహించింది.” అని మెహతా వివరించారు.
ఉపశమన ఉత్తర్వులకు సుప్రీం నిబంధనలు
కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం – 2025 పై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు ఇచ్చేందుకు బలమైన కారణాలు ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈ చట్టంలో పలు సెక్షన్లు, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం కోసం రూపొందించబడ్డాయని వధించిన వాదనలతో సీనియర్ న్యాయవాదులు కపిల్ సబల్, అభిషేక్ మను సింఘ్వి విచారణలో పేర్కొన్నారు.
ఇతర అంశాలపై విచారణ జరిపే ముందు, ఇప్పటికే నిర్ణయించిన మూడు అంశాల పరిధిలోనే మొదటగా విచారణ జరగాలని తుషార్ మెహతా మరోసారి ధర్మాసనాన్ని కోరారు.
విచారణ కొనసాగుతోంది
ఈ పిటిషన్లపై విచారణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ముందు కొనసాగుతోంది. వక్ఫ్ చట్టం చుట్టూ తిరుగుతున్న వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు అత్యంత కీలకమని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.